November 2, 2026

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం – వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యత….జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ

WhatsApp Image 2026-10-21 at 4.11.13 PM
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యత అని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఐఏఎస్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21న వికారాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ముఖ్య అతిథిగా హాజరై అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దేశ రక్షణ విధుల్లో ప్రాణాలు కోల్పోయిన పది మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది త్యాగాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలీస్ యూనిఫాం కేవలం అధికారానికి చిహ్నం కాదని, ప్రజల రక్షణ, చట్ట పరిరక్షణ, రాజ్యాంగ విలువల సంరక్షణకు ప్రతీక అని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం, సమాజం అండగా నిలవాలని అన్నారు.జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ, అమరవీరుల త్యాగాలు పోలీస్ శాఖకు నిరంతర స్ఫూర్తి అని తెలిపారు. ప్రతి పోలీస్ అధికారి నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను సానుభూతితో పరిష్కరించాలని సూచించారు. అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.అనంతరం అదనపు ఎస్పీ రాజేశ్ మీనా 2025 సెప్టెంబర్ 1 నుంచి 2026 ఆగస్టు 31 వరకు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల పేర్లను చదివి వినిపించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర పోలీస్ అధికారులు స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.వ్యాసరచన పోటీల విజేతలకు అభినందనలుపోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఎస్‌ఐలు, అంతకంటే పైస్థాయి అధికారుల విభాగంలో కోట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన డబ్ల్యూఎస్‌ఐపీ మీనాక్షి మొదటి స్థానం, పెద్దేముల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐపీ ఎం. ప్రశాంత్ వర్ధన్ రెండో స్థానం, పరిగి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐపీ బి. మోహన కృష్ణ మూడో స్థానం సాధించారు.కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్‌ఐల స్థాయి వరకు నిర్వహించిన విభాగంలో చెంగోముల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన డబ్ల్యూపీసీ జె. ప్రత్యూష మొదటి స్థానం, కరన్‌కోట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పీసీ బి. సంతోష్ రెండో స్థానం, మార్పల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన డబ్ల్యూపీసీ సీహెచ్. దీపిక మూడో స్థానం సాధించారు. విజేతలను అధికారులు అభినందించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేశ్ మీనా, డీసీఆర్‌బీ డీఎస్పీ జనయ్య, డీటీసీ డీఎస్పీ శ్రీనివాస్, వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, తాండూరు డీఎస్పీ యాదయ్య, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ వీరేశ్‌తో పాటు పలువురు సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.