November 2, 2026

“ఈ దుర్వాసన భరించలేకపోతున్నాం… కాపాడండి!” దుర్వాసనతో స్థానికుల అవస్థలు!

sevalal

తాండూరు పట్టణంలోని శ్రీ బాలాజీ ఆస్పత్రి సమీపంలో ఉన్న సద్గురు సేవాలాల్ మహారాజ్ విగ్రహం పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన పారిశుద్ధ్య లోపం నెలకొంది. విగ్రహం సమీపంలో తెరిచి ఉన్న మోరీ వల్ల విపరీతమైన దుర్వాసన వెదజల్లుతోందని, ఆ ప్రాంతంలో నివసించడమే కాకుండా వ్యాపారాలు కొనసాగించడం అసాధ్యంగా మారిందని స్థానిక వ్యాపారులు, నివాసితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మోరీ దుర్వాసన కారణంగా కస్టమర్లు దుకాణాలకు రావడానికి జంకుతున్నారని, ఫలితంగా వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని దుకాణదారులు వాపోతున్నారు. వ్యాపార నష్టాలతో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై స్థానిక కౌన్సిలర్‌తో పాటు అధికారులకు పలుమార్లు విన్నవించినా ఎవరూ స్పందించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. వినతులు ఎన్ని ఇచ్చినా సమస్య గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు, నిత్యం భక్తిశ్రద్ధలతో సద్గురు సేవాలాల్ మహారాజ్‌ను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు సైతం ఈ మోరీ దుర్వాసన తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. పవిత్రమైన విగ్రహం చెంతనే మురుగు నీరు, భరించలేని కంపు ఉండడం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో వెంటనే మున్సిపల్ అధికారులు ప్రత్యేక చొరవ చూపి, తెరిచి ఉన్న మోరీని వెంటనే మూసివేసి (స్లాబ్ వేసి) పారిశుద్ధ్య పనులను చేపట్టాలని స్థానిక వ్యాపారస్తులు, ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.