బషీరాబాద్ కాంగ్రెస్లో విభేదాలకు తెర? అసంతృప్తి నేతలతో ఎమ్మెల్యే బీఎంఆర్ సమావేశం…!
తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు సీనియర్ నాయకులు సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలో, అసంతృప్తి నేతలతో ఎమ్మెల్యే బీఎంఆర్ హైదరాబాద్లోని తన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ నెల 22వ తేదీన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు నివాసంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సమావేశమవగా, 23వ తేదీన శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డితో కూడా కొందరు నాయకులు భేటీ అయ్యారు. ఈ పరిణామాలు బషీరాబాద్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలపై చర్చకు దారితీశాయి. అనంతరం బషీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లొల్ల రాజ వర్ధన్ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించి, అసంతృప్తి నాయకులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అయితే సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అసంతృప్తి నాయకులతో సమావేశమై చర్చించారు. పార్టీలో అందరూ ఐక్యంగా ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించినట్లు సమాచారం.ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, నాయకులంతా ఐక్యంగా పనిచేస్తామని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. బషీరాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం జరగనున్న ఎమ్మెల్యే పర్యటనలో నాయకులందరూ కలిసి పాల్గొంటామని స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలను నమ్మాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మరి ఈ సమావేశంతో బషీరాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తికి పూర్తిస్థాయిలో తెరపడుతుందా? శుక్రవారం జరిగే ఎమ్మెల్యే పర్యటనలో నాయకుల ఐక్యత ఎలా కనిపిస్తుందో వేచి చూడాలి.
