November 2, 2026

తాండూరులో దీపావళి టపాకాయల విక్రయాలపై అధికారుల నిఘా ఏదీ?

SHOP

అనుమతులు లేని షాపులపై చర్యలు తీసుకోవాలి…! ప్రమాదాలు జరగకముందే అప్రమత్తం కావాలి!

దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో తాండూరు పట్టణంలో టపాకాయల విక్రయాలపై అధికారులు ఇప్పటి నుంచే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏడాది దీపావళి సమయంలో పట్టణంలో పలు ప్రాంతాల్లో టపాకాయల దుకాణాలు వెలుస్తుంటాయి. అయితే వీటిలో ఎన్ని దుకాణాలకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి? ఎన్ని దుకాణాలు నిబంధనల ప్రకారం కొనసాగుతున్నాయి? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.పేలుడు పదార్థాల చట్టం, 1884, పేలుడు పదార్థాల నిబంధనలు, 2008 ప్రకారం అవసరమైన లైసెన్సులు లేకుండా బాణసంచా విక్రయాలు, నిల్వలు చేపట్టకూడదు.ముఖ్యంగా జనావాసాల మధ్య, రద్దీ ప్రాంతాల్లో, పాఠశాలలు, ఆసుపత్రుల సమీపంలో ప్రమాదకరంగా టపాకాయల దుకాణాలు ఏర్పాటు కాకుండా అధికారులు ముందస్తు తనిఖీలు చేపట్టాలి. తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నివాసం పక్కన ఎలాంటి అనుమతి లేకుండా సుమారు 20 లక్షల విలువగల టపాకాయల గోదాం ఉన్నట్లు  వినికిడి.  పూర్తి అనుమతులు లేకుండా కొనసాగిస్తున్నాయి గోదాం పై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.  తాండూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న టపాకాయల షాపుల  విషయంలో అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి. అనుమతులు లేని దుకాణాలను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. అనుమతులు పొందిన దుకాణాల్లోనూ అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలి.అలాగే టపాకాయల గోదాముల్లో నిల్వ సామర్థ్యం, భద్రతా ప్రమాణాలు, లైసెన్సులపై ప్రత్యేకంగా పరిశీలన జరపాలి. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే… ప్రమాదం జరగకుండా ముందే చర్యలు తీసుకోవడం అధికారుల బాధ్యత. మరి ఈ దీపావళి నాటికి తాండూరులో అక్రమ టపాకాయల వ్యాపారానికి అడ్డుకట్ట పడుతుందా? అనుమతులు లేని దుకాణాలపై అధికారులు కొరడా ఝళిపిస్తారా? అనేది వేచి చూడాలి. ప్రజల ప్రాణ భద్రతే ప్రథమ ప్రాధాన్యత కావాలి… దీపావళి వెలుగుల పండుగగా మిగలాలి, ప్రమాదాలకు వేదిక కాకూడదు!