November 3, 2026

జుంటుపల్లి సీతారామచంద్రస్వామి ఆలయానికి రూ.20 కోట్ల నిధుల ప్రతిపాదనలు! తొలి విడతలో రూ.10 కోట్లు.. రెండో విడతలో మరో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళిక

WhatsApp Image 2026-11-03 at 5.24.58 PM

వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జుంటుపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి మహర్దశ పట్టనుంది. ఆలయ పునర్నిర్మాణం, సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి నిధులు (SDF) నుంచి రూ.20 కోట్లు మంజూరు చేయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.ఇందులో భాగంగా మంగళవారం ఎండోమెంట్ శాఖ, ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆలయాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలన, సర్వే నిర్వహించారు. ఆలయంలో చేపట్టాల్సిన నిర్మాణ, అభివృద్ధి పనులను గుర్తించి అంచనాలు రూపొందించే ప్రక్రియ చేపట్టారు.మొదటి విడతలో అర్థమంటపం, మహామంటపం, ఆంజనేయస్వామి ఆలయం, గోపురం, బలిపీఠం, తూర్పు రాజగోపురం తదితర నిర్మాణ పనులు చేపట్టేందుకు రూ.10 కోట్లతో ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.రెండో విడతలో ఆలయ కార్యాలయ గది, యాగశాల, వంటశాల, పడమర, ఉత్తర, దక్షిణ ద్వారాల నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో SDF నిధులు మంజూరు చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆలయ అభివృద్ధి ప్రతినిధులు కరణం పురుషోత్తమరావు, జె. రాఘవేంద్రరావు తెలిపారు. ప్రజాప్రతినిధులు నిధుల మంజూరుకు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.ఈ పరిశీలన కార్యక్రమంలో ఎండోమెంట్ శాఖ ఈఓ నాయక్, ఇంజనీరింగ్ ఏఈ తులసీరాం, ఏవో శాంత్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్, మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తమరావు, జె. రాఘవేంద్రరావు, పూజారి జోషి వాదిరాజ్, బి. వెంకట్ రెడ్డి, పి. అరవింద్ రెడ్డి, రాజకోటి మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.ఆలయ పునర్నిర్మాణం పూర్తయితే జుంటుపల్లి క్షేత్రం మరింత అభివృద్ధి చెందడంతో పాటు భక్తులకు మెరుగైన ఆధ్యాత్మిక, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని కరణం పురుషోత్తమరావు హర్షం వ్యక్తం చేశారు.ప్రభుత్వ అనుమతులు, నిధుల మంజూరు అనంతరం పనులు ప్రారంభమవుతాయని ఆలయ అభివృద్ధి ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.