తాండూర్ లో మైనారిటీ హవా.. మున్సిపల్ పీఠంపై పట్టు సాధించే దిశగా అడుగులు
తాండూర్ వైస్ చైర్మన్ పీఠంపై ‘మైనారిటీ’ గురి?
- బలంగా మైనారిటీ కౌన్సిలర్ల సమీకరణాలు
- 36 వార్డుల్లో 13 మంది విజయం.. నిర్ణయాత్మక శక్తిగా మారనున్న వైనం
తాండూర్: తాండూర్ మున్సిపల్ రాజకీయాలు సెంట్రల్ పాయింట్‌కు చేరుకున్నాయి. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వేళ పట్టణంలోని మైనారిటీ నేతలు కీలక నిర్ణయాత్మక శక్తిగా మారబోతున్నారు. ముఖ్యంగా వైస్ చైర్మన్ పీఠాన్ని మైనారిటీ వర్గానికి కేటాయించాలనే డిమాండ్ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
బలమైన సంఖ్యాబలం:
తాండూర్ పట్టణ మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా, తాజా ఫలితాల సరళిని బట్టి మైనారిటీ వర్గానికి చెందిన కౌన్సిలర్ల సంఖ్య గణనీయంగా ఉంది. వివిధ పార్టీల నుండి గెలుపొందిన వారి వివరాలు పరిశీలిస్తే:
కాంగ్రెస్ పార్టీ: 08 మంది
బీఆర్ఎస్ పార్టీ: 03 మంది
ఎంఐఎం (ఎంఐఎం): 01 వ్యక్తి
ఇండిపెండెంట్: 01 వ్యక్తి
మొత్తంగా 13 మంది మైనారిటీ కౌన్సిలర్లు విజయం సాధించడంతో, మున్సిపల్ పీఠంపై వీరి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణ జనాభాలో కూడా మైనారిటీల శాతం ఎక్కువగా ఉండటంతో, ఈసారి వైస్ చైర్మన్ పదవిని తమ వర్గానికే కేటాయించాలని ఆయా పార్టీల నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది.
నిర్ణయాత్మక శక్తిగా కాంగ్రెస్ కౌన్సిలర్లు:
అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నుండి 8 మంది మైనారిటీ కౌన్సిలర్లు గెలవడంతో, పార్టీలో వీరి ప్రాధాన్యత పెరిగింది. చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే క్రమంలో వీరి మద్దతు అత్యంత కీలకం కానుంది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు ఎటు మలుపు తిరుగుతాయోనని పట్టణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
– సంకల్పం ప్రతినిధి MSG
