November 4, 2026

సంకల్పం పెద్దేముల్ ప్రతినిధి, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దేముల్ మండల కేంద్రంలోని శ్రీ శంభు లింగేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మారుమోగింది. ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించి, భారీ ఎత్తున దీపోత్సవం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ఆవరణలో వేలాది ప్రమిదలతో దీపాలు వెలిగించి, వాటిని శివలింగం ఆకారంలో అందంగా అమర్చారు. దీపాల వెలుగుల్లో శంభు లింగేశ్వరుని సన్నిధి ఆధ్యాత్మిక కాంతులతో విరాజిల్లింది. ఈ దీపోత్సవ దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం, గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు.