September 18, 2026

భారీ వర్షాల హెచ్చరిక: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా, IPS

WhatsApp Image 2026-07-30 at 2.52.50 PM

రాబోయే 48 గంటల పాటు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు.భారీ వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఎస్పీ ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితులకు వెంటనే స్పందించేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.అలాగే రెవెన్యూ, అగ్నిమాపక, వైద్య, పంచాయతీరాజ్ తదితర శాఖలతో సమన్వయం కొనసాగిస్తూ సహాయక చర్యలు చేపట్టాలని, అంబులెన్సులు, వైద్య బృందాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.ప్రజలు వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని ఎస్పీ హెచ్చరించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, పిల్లలను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనివ్వవద్దని సూచించారు.పాత ఇండ్లలో నివసించే కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలాలని, శిథిల భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని తెలిపారు. రోడ్లపై నీరు నిల్వ ఉండటం, గుంతలు కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు నెమ్మదిగా, జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. గ్రామ సర్పంచ్‌లు, ఇతర శాఖల అధికారులతో కలిసి వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పోలీసు అధికారులకు ఎస్పీ ఆదేశించారు. ప్రమాదకర వాగులు, కల్వర్టులు, వరద ముంపు ప్రాంతాల వద్ద రోడ్డు బ్లాక్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రమాదకర ప్రాంతాలను గుర్తించడం, ట్రాఫిక్ మళ్లించడం, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అత్యవసర సహాయం కోసం ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్–100 లేదా వికారాబాద్ జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్: 8712670056 కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS విజ్ఞప్తి చేశారు.