సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన పెనుప్రమాదం.. గాల్లో 20 నిమిషాల ఉత్కంఠ తర్వాత సురక్షిత ల్యాండింగ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న ఢిల్లీ–హైదరాబాద్ ఇండిగో 6E717 విమానానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుంచి ల్యాండింగ్ క్లియరెన్స్ ఆలస్యం కావడంతో, ఇప్పటికే ల్యాండింగ్‌కు దిగుతున్న విమానం చివరి క్షణంలో మళ్లీ టేకాఫ్ తీసుకుంది.ఈ పరిణామంతో విమానం సుమారు 20 నిమిషాల పాటు హైదరాబాద్ గగనతలంలో చక్కర్లు కొట్టింది. విమానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మొత్తం 229 మంది ప్రయాణికులు ఉండటంతో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా విమానం గాల్లో తిరుగుతుండటంతో ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమైంది.ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం కావడంతో భద్రతా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అనంతరం రాత్రి 8:35 గంటలకు అవసరమైన అనుమతులు లభించడంతో విమానం శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానం సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అధికారికంగా విమానయాన సంస్థ లేదా సంబంధిత అధికారులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది.
