September 18, 2026

తాండూరులో SIR ప్రక్రియ 100 శాతం పూర్తి…..విలేకరుల చిట్‌చాట్ లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

ChatGPT Image Aug 12, 2026, 12_12_22 AM

తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, SIR ప్రక్రియ, రాబోయే ఎన్నికలు, తాగునీరు, రోడ్లు, వైద్య సదుపాయాలు, అక్రమ నిర్మాణాలు తదితర అంశాలపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాండూరు నియోజకవర్గంలో SIR ప్రక్రియ 100 శాతం పూర్తయిందని,అందుకోసం అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కర్ణం పురుషోత్తంరావును ఎమ్మెల్యే అభినందించారు. SIR ప్రక్రియలో భాగంగా నియోజకవర్గంలో దాదాపు 65 వేల ఓట్లు తొలగిపోయాయని పేర్కొన్నారు. పట్టణాల్లో నివసిస్తున్న పలువురు తమ సొంత గ్రామాలకు ఓట్లను మార్చుకున్నారని తెలిపారు. SIR ప్రక్రియ ప్రభావం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.రాబోయే ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాదని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో Gen Z ప్రభావం బలంగా ఉందని పేర్కొన్నారు.తాండూరు నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు, అభివృద్ధి అంశాలను అసెంబ్లీలో తాను ఎక్కువసార్లు ప్రస్తావించానని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు. జిల్లా ఆస్పత్రిలో ఆధునిక వైద్య సదుపాయాలు, అవసరమైన వైద్య పరికరాలు, మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని బీఎంఆర్ తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఆస్పత్రిని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. తాండూరు పట్టణంలో మురుగునీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు STP (మురుగునీటి శుద్ధి కర్మాగారాలు) నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.తాండూరు ప్రజలకు త్వరలో కాగ్నానది నుంచి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని బుయ్యని మనోహర్ రెడ్డి వెల్లడించారు. ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు.తాండూరు పట్టణంలో నిరుద్యోగ యువత కోసం SI, కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. గతంలో పరిగిలో కూడా ఇలాంటి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణాను అరికడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని తెలిపారు. మున్సిపల్ స్థలాలను గుర్తించి వాటి వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిస్తామని చెప్పారు.తాండూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు 60 శాతం రోడ్ల పనులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని అన్నారు.ఎన్నికలకు ఏడాది ముందుగానే నియోజకవర్గంలోని రోడ్ల పనులను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నానని బీఎంఆర్ తెలిపారు. ATCలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించారని ఎమ్మెల్యే అభినందించారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని అన్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి విలేకరులతో కలిసి అల్పాహారం చేస్తూ ఆత్మీయంగా ముచ్చటించారు. నియోజకవర్గంలోని వివిధ అంశాలపై మీడియా ప్రతినిధులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.