July 30, 2026

మన్ననూరులో సంచలనం.. దర్గా వెనుక ప్రత్యక్షమైన నంది విగ్రహం.. గుప్తనిధుల కోణంలోనూ అనుమానాలు!

WhatsApp Image 2026-07-30 at 12.47.54 PM

నల్లమల అటవీ ప్రాంతంలోని మన్ననూరు సమీపంలో ఓ నంది విగ్రహం ప్రత్యక్షమవడం స్థానికంగా సంచలనంగా మారింది. నిరంజన్ షావలి దర్గా వెనుక భాగంలో ఉన్న పురాతన రాతి ద్వారం సమీపంలో ఈ నంది విగ్రహం కనిపించడంతో స్థానికులు, శ్రీశైలం వెళ్లే భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.సమాచారం అందుకున్న స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా, దాదాపు రెండు అడుగుల ఎత్తు, మూడు అడుగుల పొడవు ఉన్న నల్లరాతి నంది విగ్రహంగా గుర్తించారు. పురాతన శిల్పకళను తలపించే ఈ విగ్రహం అక్కడికి ఎలా వచ్చింది అనే అంశంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.స్థానికుల కథనం ప్రకారం, గుర్తుతెలియని వ్యక్తులు వాహనంలో విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ వదిలి వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటన స్థలం వరకు వాహనం వచ్చినట్లు చక్రాల గుర్తులు కనిపించాయని వారు చెబుతున్నారు.మరోవైపు, ప్రతాపరుద్రుని కోటకు సంబంధించిన పురాతన రాతి ద్వారం సమీపంలో ఈ విగ్రహం కనిపించడంతో గుప్తనిధుల తవ్వకాల కోణంలోనూ చర్చలు జరుగుతున్నాయి. ఈ ఘటన వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీయాలని, పురావస్తు శాఖ, అటవీ శాఖ, పోలీసు అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.ప్రస్తుతం నల్లమల ప్రాంతంలో నంది విగ్రహం ప్రత్యక్షమైన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారులు విచారణ అనంతరం మాత్రమే ఈ ఘటనపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.