గుల్లగూడ రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ తాత్కాలికంగా మూసివేత
వికారాబాద్ జిల్లాలోని గుల్లగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 19-Tను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే ట్రాక్‌పై అత్యవసర మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఆగస్టు 10 నుంచి ఆగస్టు 17, 2026 వరకు ఈ గేట్ ద్వారా రోడ్డు రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఈ పనుల్లో రైల్వే ట్రాక్ ఓవర్హాలింగ్తో పాటు, లెవల్ క్రాసింగ్ వద్ద రోడ్డు ఉపరితలాన్ని మెరుగుపరిచే పనులు కూడా చేపట్టనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రజల భద్రత, రాకపోకల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గంగ్యాడ, ఎల్లకొండ, గుల్లగూడ గ్రామాల సర్పంచ్‌లు, నవాబ్‌పేట్ తహసీల్దార్, పోలీసు అధికారులు, ఆర్పీఎఫ్తో పాటు సంబంధిత అధికారులకు సమాచారం కూడా అందించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాబట్టి ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి, రైల్వే అధికారులకు సహకరించాలని అధికారులు ఒక ప్రకటనలో కోరారు.
