నిర్ణీత గడువులోగా జనగణన–2027 వివరాల సేకరణ పూర్తి చేయాలి వీడియో కాన్ఫరెన్స్ లో జనగణన సంచాలకులు భారతి హోళ్లికేరి
జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీపై రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళ్లికేరి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ డైరెక్టరీ, పట్టణ డైరెక్టరీలకు సంబంధించిన సమాచారాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోగా సేకరించి వెబ్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆమె స్పష్టం చేశారు. విద్య, ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, రవాణా, బ్యాంకింగ్, పోస్టల్ సేవలు, వ్యవసాయం, మార్కెటింగ్, ప్రభుత్వ సేవలు తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.ఫీల్డ్ ఫంక్షనరీలకు ప్రత్యేక శిక్షణ అందించి, డేటా సేకరణలో ఏకరూపత, నాణ్యతను నిర్ధారించాలని పేర్కొన్నారు. మొబైల్ యాప్, వెబ్ పోర్టల్, అవసరమైతే భౌతిక షెడ్యూల్ ద్వారా సమాచార సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను గోప్యంగా ఉంచాలని, అధికారిక యాప్, వెబ్ పోర్టల్ ద్వారానే సమాచారాన్ని నమోదు చేయాలని, సోషల్ మీడియా ద్వారా అధికారిక సమాచారాన్ని పంచుకోవద్దని అధికారులకు సూచించారు. వికారాబాద్ జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, అదనపు కలెక్టర్ వెంకటాచారి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు, ఉప గణాంక అధికారి తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.అనంతరం జిల్లా అధికారులతో సమావేశమైన కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ… జనగణన హ్యాండ్‌బుక్ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల అభివృద్ధి, విధాన నిర్ణయాలకు ప్రామాణిక సమాచార గ్రంథంగా ఉపయోగపడుతుందని తెలిపారు..సమాచార సేకరణ, వెబ్ పోర్టల్‌లో నమోదు ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, జిల్లా అభివృద్ధికి బలమైన సమాచార పునాదిని సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
