కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా మాణిక్ నగర్, మున్సిపల్ క్వార్టర్స్‌లో తనిఖీలు….తాండూర్‌లో పోలీసుల విస్తృత తనిఖీలు.. 65 బైక్‌లు, 56 మద్యం బాటిళ్లు స్వాధీనం
వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు తాండూర్ పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తాండూర్ డీఎస్పీ శ్రీ ఎన్. యాదయ్య ఆధ్వర్యంలో తాండూర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణిక్ నగర్, మున్సిపల్ క్వార్టర్స్ ప్రాంతాల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ (CASO) నిర్వహించారు. ఈ తనిఖీల్లో తాండూర్ డీఎస్పీతో పాటు తాండూర్ టౌన్ ఇన్‌స్పెక్టర్ పరమేశ్వర్, కరణ్‌కోట్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, డివిజన్ పోలీసు సిబ్బంది, ఏఆర్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, అక్రమ కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఇద్దరు అనుమానిత వ్యక్తులను తనిఖీ చేయడంతో పాటు పాపిలాన్ పరికరాన్ని ఉపయోగించి తనిఖీలు చేపట్టారు. మొత్తం 65 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 56 మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించిన పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలు, ఇతర రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా తాండూర్ డీఎస్పీ ఎన్. యాదయ్య మాట్లాడుతూ.. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. తనిఖీల్లో గుర్తించిన వాహనాల పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి, తమ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ కోరారు.
