August 2, 2026

రాస్నం రైతులకు వెంటనే వడ్ల కొనుగోలు డబ్బులు చెల్లించాలి: కేవీపీఎస్ నాయకుల డిమాండ్

01

యాలాల మండలం రాస్నం గ్రామ రైతులకు ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్ల కొనుగోలు కేంద్రంలో విక్రయించిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులు రెండు నెలలు గడిచినా అందలేదని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు యు. బుగ్గప్ప ఆరోపించారు. ఆదివారం యాలాల  మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కొందరు రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన డబ్బులు ఇతరుల ఖాతాలకు వెళ్లినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు వెంటనే బకాయి చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి  పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను  చేస్తామని హెచ్చరించారు.  ఈ సమావేశంలో గణేష్, అనంతయ్య, వెంకటేష్ రైతులు తదితరులు పాల్గొన్నారు.