ఆగస్టు 10లోపు బూత్, గ్రామ, మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని నిర్ణయం – ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యాచరణకు శ్రీకారం
ఆగస్టు 10లోపు బూత్, గ్రామ, మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ జాదవ్ తెలిపారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జాదవ్ ధారసింగ్ నాయక్ అధ్యక్షతన ఆదివారం అనంతగిరి హరిత వ్యాలీ వ్యూ రిసార్ట్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు.ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతంపై విస్తృతంగా చర్చించారు. బూత్, గ్రామ, మండల, టౌన్ కాంగ్రెస్ కమిటీలను ఆగస్టు 10లోపు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ బాధ్యతలను జిల్లా కార్యవర్గ సభ్యులకు అప్పగిస్తూ, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో సమన్వయంగా పనిచేసి నిర్ణీత గడువులో కమిటీల ఏర్పాటును పూర్తి చేయాలని సూచించారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. అర్హులైన పట్టభద్రులను గుర్తించడం, ఓటరు నమోదును వేగవంతం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయాలని, ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టాలని సమావేశం పిలుపునిచ్చింది. సోషల్ మీడియాతో పాటు గ్రామస్థాయిలో ప్రజలకు సరైన సమాచారాన్ని అందించేందుకు నాయకులు చురుకుగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పలు నిర్మాణాత్మక సూచనలు చేశారు. వాటిని రాష్ట్ర పార్టీ అధిష్టానానికి నివేదించి అమలుకు కృషి చేయాలని నిర్ణయించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి నాయకుడు సమిష్టిగా పనిచేయాలని తీర్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ, వైస్ చైర్మన్లు, జనరల్ సెక్రటరీలు, స్పోక్స్‌పర్సన్లు, సెక్రటరీలు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
