SIR గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు – అర్హులైన ప్రతి ఒక్క ఓటరు నమోదు చేసుకోవాలి: కాంగ్రెస్ SIR కన్వీనర్ కరణం పురుషోత్తం రావు
భారత ఎన్నికల సంఘం (ECI) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ గడువును ఆగస్టు 10, 2026 వరకు పొడిగించినట్లు కాంగ్రెస్ పార్టీ SIR కన్వీనర్ కరణం పురుషోత్తం రావు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి అర్హ ఓటరు వినియోగించుకుని ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.తాండూర్ నియోజకవర్గంలో మొత్తం 2,52,235 మంది ఓటర్లలో ఇప్పటివరకు 2,29,102 మంది (90.83 శాతం) SIR ప్రక్రియలో తమ వివరాలను డిజిటలైజేషన్ ద్వారా నమోదు చేసుకున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు 73 పోలింగ్ స్టేషన్లలో 100 శాతం నమోదు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.అయితే ఇంకా 23,133 మంది ఓటర్లు వివిధ కారణాలతో నమోదు ప్రక్రియ పూర్తి చేయలేదని పేర్కొన్నారు. చనిపోయిన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన వారు, గుర్తించని ఓట్లు, అర్హత సాధించిన కొత్త ఓటర్ల వివరాలను కూడా ఈ ప్రక్రియలో నవీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా తాండూర్ నియోజకవర్గంలోని 269 మంది బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) తమకు కేటాయించిన బూత్ పరిధిలో ఇంకా నమోదు చేసుకోని అర్హులైన ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకుని, అవసరమైన పత్రాలతో వారి నమోదు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయించాలని సూచించారు. అర్హత కలిగిన ఓటరు కూడా ఓటరు జాబితా నుంచి మినహాయించబడకుండా ప్రతి ఇంటిని సందర్శించి, పెండింగ్‌లో ఉన్న నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి 100 శాతం SIR నమోదు లక్ష్యాన్ని సాధించి తాండూర్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని కాంగ్రెస్ పార్టీ SIR కన్వీనర్ కరణం పురుషోత్తం రావు ఒక ప్రకటనలో కోరారు.
