వికారాబాద్‌లో నకిలీ డీఏపీ దందాపై సమగ్ర విచారణ జరపాలి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్
వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసిన నకిలీ డీఏపీ (DAP) ఎరువుల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు. రమేష్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం రమేష్ కుమార్ ఒక ప్రకటనలో…నల్లటి నేలలో చెమటోడ్చి పంటలు పండించే రైతుల జీవితాలతో నకిలీ మాఫియా చెలగాటమాడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాలోనే ఇలాంటి నకిలీ ఎరువుల దందా సాగడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.రైతులను నమ్మించేందుకు డీఏపీ ఎరువుల బస్తాలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని ముద్రించి, లోపల సున్నం, మట్టి వంటి పదార్థాలను నింపి విక్రయించడం దారుణమన్నారు. అప్పులు చేసి ఎరువులు కొనుగోలు చేసిన రైతులు వాటిని పొలాల్లో చల్లిన తర్వాత మోసపోయామని తెలుసుకుని తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు.ఇటీవల పరిగిలో రూ.35 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడగా, ఇప్పుడు నకిలీ డీఏపీ ఎరువులు బయటపడటం విజిలెన్స్, పోలీసు యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులను వదిలేసి కేవలం మధ్యవర్తులను మాత్రమే అరెస్టు చేసి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. ప్రధాన నిందితులను గుర్తించి, రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నకిలీ ఎరువుల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని, నకిలీ ఎరువులు విక్రయిస్తున్న వ్యాపారుల లైసెన్సులను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.
