August 1, 2026

రైతులు దళారులను నమ్మి నకిలీ డీఏపీ కొనొద్దు.. అప్రమత్తంగా ఉండాలి… మాజీ ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి

ChatGPT Image Aug 1, 2026, 04_00_28 PM

గ్రామాల్లో కొందరు యువకులను ఆధారంగా చేసుకుని దళారులు రైతులకు నకిలీ డీఏపీ ఎరువులను విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి దళారుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి సూచించారు.డీఏపీ ఎరువులు బహిరంగంగా విక్రయించడం లేదని, తక్కువ ధరకే లభిస్తాయని నమ్మించి రైతులను మోసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా విక్రేత వద్ద నుంచి బిల్లు తీసుకోవాలని, లేకపోతే మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బిల్లు లేకుండా కొనుగోలు చేయడం అంటే పొలంలో సున్నం చల్లినట్టేనని వ్యాఖ్యానించారు. నాసిరకం, డూప్లికేట్ డీఏపీ వాడటం వల్ల పంటలకు తీవ్ర నష్టం కలగడమే కాకుండా రైతులు ఆర్థికంగా కూడా నష్టపోతున్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో పాల్గొంటున్న దళారులపై పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అమాయక రైతులపై కాకుండా వారిని మోసం చేసిన దళారులపైనే కేసులు నమోదు చేయాలని సూచించారు.పెద్దేముల్ మండలానికి చెందిన ఒక వ్యక్తి ద్వారా జరిగిన వ్యవహారంలో పలువురు రైతులు మోసపోయారని తెలిపారు. యాలాల మండలంలోనే 4,000 బస్తాలకు పైగా నాసిరకం డీఏపీ విక్రయించబడినట్లు సమాచారం ఉందని, ఇదే తరహా విక్రయాలు తాండూర్ నియోజకవర్గంలోని ఇతర గ్రామాల్లో కూడా జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే నకిలీ డీఏపీ కొనుగోలు చేసిన రైతులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే విక్రయించిన వారి వద్దకు వెళ్లి ఎరువును తిరిగి ఇచ్చి తమ డబ్బులు తీసుకోవాలని బాల్‌రెడ్డి సూచించారు. రైతు దేశానికి వెన్నెముక అని, అలాంటి రైతును మోసం చేసే వారిపై ఎలాంటి కనికరం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గతంలో కూడా నకిలీ పత్తి విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు మోసపోయిన ఘటనలను గుర్తు చేసిన ఆయన, భవిష్యత్తులో ఎరువులు, విత్తనాలు లేదా ఇతర వ్యవసాయ సామగ్రి కొనుగోలు చేసే ప్రతి సందర్భంలో రైతులు తప్పనిసరిగా బిల్లులు తీసుకుని భద్రపరచుకోవాలని సూచించారు.