గాజీపూర్ సమీపంలో ఆటో-బైక్ ఢీ: పలువురికి గాయాలు
పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామ సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణీకులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ప్రయాణీకులతో పాటు బైక్ పై ఉన్న వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. తాండూరు నుండి పెద్దేముల్ వైపు పెళ్లి సామాన్లతో వెళ్తున్న ఆటోను గాజీపూర్ వద్ద ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి తీవ్రంగా గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పెళ్లి సామాగ్రి చెల్లాచెదురుగా పడిపోవడంతో వేరే ఆటోలో సామాన్లను తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
