ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్ ….. !
తాండూరు మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం తాండూరు పట్టణంలోని 36 వార్డులలో 117 పోలింగ్ కేంద్రాలలో జరిగిన ఎన్నికల్లో 52,025 మంది ఓటు హక్కు వినియోగించు కోవడంతో 67.54 ఓటింగ్ శాతం నమోదయింది. ఉదయం నుండి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. కొడంగల్ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సాయి పూర్ లోని కృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో కుటుంబ సమేతంగా హాజరై తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అత్యధిక కౌన్సిలర్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించనుందని తెలిపారు. కాగా కొన్ని కేంద్రాల దగ్గర స్వల్ప సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాండూరు పట్టణంలోని విజయ విద్యాలయం ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం లో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య గొడవ జరిగింది.కాంగ్రెస్ పార్టీ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను అక్కడి నుండి పంపించారు. తాండూరు పట్టణంలోని వార్డ్ నెంబర్ 7, 8 రాజీవ్ కాలనీ, మాణిక్ నగర్ తదితర ప్రాంతాల్లో కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి.మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలువురు నాయకులు తామే మాట్లాడుతూ తామే అత్యధిక కౌన్సిలర్ సీట్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులు తమకు ఆహారాన్ని సరిగా అందించలేదని మధ్యాహ్నం సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ బాక్స్ లను సెయింట్ మార్క్స్ పాఠశాలకు తరలించిన అనంతరం చెల్లించవలసిన డబ్బులు సమయానికి చెల్లించలేరని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం మరియు రాత్రిపూట భోజనం సరిగా లేదని విధులు నిర్వహించిన ఉపాధ్యాయులు ఆగ్రహ వ్యక్తం చేశారు.
