July 30, 2026

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా చర్యలు …ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై రాజకీయ పార్టీలతో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ సమీక్ష

VVVV

వికారాబాద్ జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా గురువారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 10,17,671 మంది ఓటర్లలో ఇప్పటివరకు 7,96,005 మంది ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయిందని, ఇది సుమారు 83 శాతం పురోగతి అని కలెక్టర్ వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా 1,13,092 మంది ఏఎస్‌డీ (Absent, Shifted, Death, Duplicate) ఓటర్లుగా గుర్తించినట్లు తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆగస్టు 3వ తేదీలోపు ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసి, 100 శాతం డిజిటలైజేషన్ లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు కృషి చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ఏఎస్‌డీ జాబితాలను ప్రదర్శించినట్లు ఆయన తెలిపారు. ఈ జాబితాలను రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి ఏజెంట్లు క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులకు సహకరించాలని కోరారు. జాబితాల్లో ఏవైనా లోపాలు లేదా అభ్యంతరాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణపై కూడా చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఒక పోలింగ్ కేంద్రంలో 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే, ఒకే కుటుంబానికి చెందిన సభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే అవకాశం ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఓటు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్న కలెక్టర్, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడానికి రాజకీయ పార్టీలు, బూత్ స్థాయి ఏజెంట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటాచారి, డీఆర్‌ఓ స్వర్ణలత, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ నెమత్ అలీ, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.