తాండూర్‌లో విషాదం.. రెండో అంతస్తు నుంచి పడి చిన్నారి మృతి
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని గాంధీనగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు రెండో అంతస్తు నుంచి కిందపడిన 18 నెలల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 3వ తేదీ సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో దీక్షిత్ (18 నెలలు) తన అమ్మమ్మ ఇంటి రెండో అంతస్తులో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర తలకు గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు చిన్నారిని తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఎంసీహెచ్ ఆసుపత్రికి, అనంతరం హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ ఆగస్టు 4వ తేదీ ఉదయం సుమారు 8:50 గంటలకు చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మృతి పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగినదేనని, ఎవరిపైనా ఎలాంటి అనుమానం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టారు.
