తాండూర్లో తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) జెండా ఆవిష్కరణ.. పార్టీ బలోపేతానికి కంచర్ల శివారెడ్డి పిలుపు
తాండూర్ పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు కంచర్ల శివారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మండలాలు, గ్రామాల స్థాయిలో కూడా పార్టీ జెండాలను ఆవిష్కరించి సంస్థాగతంగా టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. తాండూర్ నియోజకవర్గంలో బలమైన కార్యకర్తల బృందాన్ని తయారు చేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో తాండూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ విజయాన్ని సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ సామాజిక న్యాయాన్ని పాటిస్తామని కంచర్ల శివారెడ్డి తెలిపారు. ఈ నెల 6న హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న టీఆర్ఎస్ సామాజిక న్యాయ తెలంగాణ భారీ సభను విజయవంతం చేయాలని, తాండూర్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తాండూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్, మాజీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా శిశు సంరక్షణ శాఖ ఆర్గనైజర్, తెలంగాణ ఉద్యమకారుడు ఆరూరు వీరమణి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పటివరకు తగిన న్యాయం జరగలేదని అన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ అధినేత కవిత నాయకత్వంలో ఉద్యమకారులకు గుర్తింపు, న్యాయం లభిస్తోందని పేర్కొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ‘పంచ భూతాల సాక్షిగా – పంచసూత్రాలు’ పేరుతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ శ్రీనివాస్, జూకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజశేఖర్, టీఆర్ఎస్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు దీపక్ రెడ్డి, పార్టీ నాయకులు శ్రీనివాస్, యాదయ్య, మహిళా విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు మరియు పలువురు మహిళలు పాల్గొన్నారు.
