తాండూర్పట్టణంలో ప్రభుత్వ భూమిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు చర్యలు తీసుకోవాలి…. కౌన్సిలర్ ఇర్షాద్ డిమాండ్
తాండూర్ పట్టణంలోని సర్వే నెం. 135లో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని కౌన్సిలర్ ఇర్షాద్ తాండూరు మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సర్వే నెం. 135లో ప్రభుత్వ భూమితో పాటు చట్టబద్ధమైన లీజుదారులు, ఇతర హక్కుదారులు కూడా ఉన్నారని కానీ ప్రభుత్వ భూమికి చెందిన కొంత భాగంలో ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే, గతంలో సర్వే నెం. 111లో వివాదాస్పద నిర్మాణాలు, ఆక్రమణలతో సంబంధం ఉన్న వ్యక్తులే ఇప్పుడు సర్వే నెం. 135లోని ప్రభుత్వ భూమిలో కూడా నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని, ఈ అంశంపై రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను నిర్ధారించాలని ఈర్షద్ వినతి పత్రం ద్వారా కమిషనర్ రాకేష్ రెడ్డిని కోరారు. ఒకవేళ ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు తేలితే వాటిని వెంటనే నిలిపివేసి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడం సంబంధిత అధికారుల బాధ్యత అని పేర్కొంటూ, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని తక్షణ చర్యలు చేపట్టాలని కౌన్సిలర్ ఇర్షాద్ డిమాండ్ చేశారు.
