మైల్వార్‌లో శ్రీ సోంబాయి దేవాలయ నిర్మాణానికి భూమిపూజ
మైల్వార్ గ్రామంలో ఆర్య కటికల కులదైవం శ్రీ సోంబాయి అమ్మవారి దేవాలయ నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.శ్రీ శంకర్ స్వామి చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించారు. దేవాలయ నిర్మాణం కోసం ఆర్య కటికల కులస్తులు తమ వద్ద ఉన్న చిన్నచిన్న ఇళ్ల స్థలాలను ఒకచోట చేర్చి, దానపత్ర రూపంలో సమర్పిస్తున్నట్లు తెలిపారు. తమ ఆరాధ్య దైవమైన శ్రీ సోంబాయి అమ్మవారి దేవాలయాన్ని నిర్మించి, మొక్కులు తీర్చుకుంటామని కులస్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ శంకర్ స్వామి మాట్లాడుతూ.. శ్రీ సోంబాయి అమ్మవారి దేవాలయాన్ని నిర్మించడం ద్వారా ఆర్య కటికల కులస్తులకు ఆధ్యాత్మికంగా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. దేవాలయ నిర్మాణంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని, తరతరాలుగా ఆరాధిస్తున్న అమ్మవారి పవిత్రతను భవిష్యత్ తరాలకు అందించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ సోంబాయి దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అంబాజీ, కార్యదర్శి సోంప్రకాష్, ఉపాధ్యక్షులు అశోక్‌తో పాటు పలువురు కులస్తులు పాల్గొన్నారు.
