November 4, 2026

నీటి వృథా అరికడదాం.. భూగర్భ జలాలను కాపాడుకుందాం: పెద్దేముల్ సర్పంచ్ డీవై నర్సింలు

పెద్దేముల్, ఫిబ్రవరి 9: గ్రామాల్లో నీటి వృథాను అరికట్టి, భూగర్భ జల మట్టాలను పెంచడమే లక్ష్యంగా పెద్దేముల్ సర్పంచ్ డీవై నర్సింలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామ పరిధిలోని ప్రతి ఇంటి నల్లాకు తప్పనిసరిగా ట్యాపులను బిగించేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంచినీరు ఎంతో విలువైనదని, నల్లాలు తెరిచి ఉంచడం వల్ల వేలాది లీటర్ల నీరు వృథాగా పోయి మురుగు కాలువల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఇంటి నల్లాకు ట్యాపులు బిగించుకోవాలని ఆయన కోరారు. నీటిని పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు నీటి ఎద్దడి లేకుండా చూడవచ్చని, అలాగే భూగర్భ జలాలు అడుగంటిపోకుండా కాపాడుకోవచ్చని సూచించారు. సర్పంచ్ స్వయంగా రంగంలోకి దిగి ఈ పనులను పర్యవేక్షిస్తుండటంతో గ్రామస్థులు ఆయన చొరవను అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.