పెద్దేముల్ ఫిబ్రవరి 9: పెద్దేముల్ మండల రైతుల కోసం ఈనెల 10వ తేదీ మంగళవారం నాడు ‘అధిక సాంద్రత పత్తి సాగు పద్ధతి’ (HDPS – High Density Planting System) పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ మరియు తాండూరు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సు జరగనుంది. రేపు ఉదయం 11:00 గంటలకు స్థానిక పెద్దేముల్ రైతు వేదికలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. పత్తి సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు అనుసరించాల్సిన మెళకువలు, అధిక సాంద్రత సాగు పద్ధతిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను శాస్త్రవేత్తలు రైతులకు వివరించనున్నారు. కావున మండలంలోని రైతులందరూ అధిక సంఖ్యలో హాజరై, శాస్త్రవేత్తల సూచనలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మండల అధికారి పవన్ ప్రీతం కోరారు.