ఎమ్మెల్యే గారు మీ తాటాకు చప్పులకు భయపడేదే లేదు….. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాటాకు చప్పులకు భయపడేదే లేదని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు నామినేషన్లు వేయడానికి కౌన్సిలర్ అభ్యర్థులు కూడా దొరకలేదని ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ నుండి బరిలో ఉన్న తమ కౌన్సిలర్ అభ్యర్థులను కొందరిని తమ నామినేషన్లు ఉప సంహరించు కావాలని ఒత్తిడి చేశారని, అరాచకపు రాచకీయాలకు ఎమ్మెల్యే తెరలేపారని అన్నారు. తాండూరు పట్టణ ప్రముఖులను కూడా బెదిరింపులకు గురి చేశారని అందుకు భయపడి కొందరు పట్టణ వాసులు తీర్థయాత్రలకు వెళ్లిన సంఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు. కొందరు తనతో తాండూరు ఎమ్మెల్యే సుద్ధ పూసల కనబడతారు కానీ చాలా డేంజర్ అని, పూసరవెల్లిలా రంగులు మారుస్తారని తనతో కొందరు అన్నారని తెలిపారు. పోలీసులను బెదిరించి, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారితో దొంగ ఓట్లు వేయించారని రోహిత్ రెడ్డి ఆరోపించారు. కౌంటింగ్ జరుగుతున్న రోజు వార్డు నంబర్ 2 ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేను కౌంటింగ్ కేంద్రానికి ఎలా అనుమతించారని, ఎమ్మెల్యే తో పాటు 30 మందిని అనుమతించారని మరి తనను ఎందుకు అనుమతించలేదని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆ విషయాన్ని అడగడానికి వెళితే తనను అడ్డుకొని తనపై కేసులు చేశారని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు 420 హామీలతో పాటు ఒక్కొక్క వార్డులో 200 ఇండ్లు ఇస్తామని పట్టణ ప్రజలను మభ్య పెట్టారని అన్నారు.
