జనగాం గ్రామ పంచాయతీలో తీర్మానం చేయకుండానే నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం పనులు చేపడుతున్నారని వార్డు సభ్యుల ఆరోపణలు
oplus_2
– సర్పంచ్ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాధనం వృధా.. వార్డు సభ్యుల ధ్వజం
– గ్రామ పంచాయతీలో తీర్మానం చేయకుండానే నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం పనులు చేపడుతున్నారని వార్డు సభ్యుల ఆరోపణలు
సంకల్పం ప్రతినిధి పెద్దేముల్ : పెద్దేముల్ మండలంలోని జనగాం గ్రామ పంచాయతీలో ఎటువంటి తీర్మానం లేకుండా, పాత భవనం అందుబాటులో ఉన్నప్పటికీ కొత్త పంచాయతీ భవన నిర్మాణాన్ని చేపట్టడంపై జనగాం గ్రామ వార్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని వారు ఆరోపించారు. బుధవారం వార్డు సభ్యులు దొరోల్ల మధుసూదన్ రెడ్డి (7వ వార్డు), చెక్కల నర్సింలు (1వ వార్డు), కె. మల్లేశం (8వ వార్డు), ఎస్. మల్లేశం (6వ వార్డు), మరియు శివకుమార్ (9వ వార్డు) విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఇప్పటికే పటిష్టమైన పంచాయతీ భవనం ఉండగా, కనీసం గ్రామ సభాలో తీర్మానం కూడా చేయకుండా కొత్త భవనం నిర్మించడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నించారు. గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతులు, కొత్త రోడ్లు, సిసి రోడ్ల వంటి మౌలిక సదుపాయాల అవసరం ఎంతో ఉందని వారు గుర్తుచేశారు. ప్రజలకు అత్యవసరమైన పనులకు నిధులు కేటాయించకుండా, అనవసర కట్టడాలతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఈ నిర్మాణాన్ని అడ్డుకోవాలని, ప్రజా అవసరాలకు అనుగుణంగా నిధులను ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామ ప్రజలతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
గ్రామ అభివృద్ధి పనులను అడ్డుకోవడం సరికాదు జనగాం గ్రామ సర్పంచ్ అరుణ,
ఇదే విషయమై సర్పంచ్ అరుణ కు వివరణ కోరగా గ్రామానికి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకొని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నానే తప్ప తన స్వంత లాభం కోసం చేయడంలేదని, తనకు గ్రామ పంచాయతీలో తీర్మానం కోసం పూర్తి కోరం ఉందని అన్నారు. సర్పంచ్ లకు ట్రైనింగ్ ఉండటంవల్ల సమయం తక్కువ ఉండటం వల్ల గ్రామ పంచాయతీ నూతన భవనం నిర్మాణం పనులు వేగవంతంగా చేయడం జరిందని, గ్రామ అభివృద్ధి కోసం వార్డు సభ్యులు సహకరించాలని గ్రామానికి వచ్చిన నిధులను అడ్డుకొని గ్రామ అభివృద్ధినీ అడ్డుకోవద్దని కోరారు. మరో సారి గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజ సలహాలు సూచనలు తీసుకొని గ్రామ అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు.
