September 19, 2026
IMG-20260315-WA0078

– అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– భారీగా తరలివచ్చిన భక్తులు..
– ఊరంతా ఆధ్యాత్మిక సందడి

పెద్దేముల్: పెద్దేముల్ మండల పరిధిలోని మారేపల్లి గ్రామంలో ఆదివారం అరె మైసమ్మ అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ దేవతకు బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో భాగంగా తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.
ఆడపడుచుల సందడి:
గ్రామ ఆడపడుచులు, మహిళలు తలపైన బోనాలతో డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి, నైవేద్యాలు పెట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మారేపల్లి సర్పంచ్ సునీత మహిళలతో కలిసి నడుస్తూ వారిలో ఉత్సాహం నింపారు. పోతురాజుల్ విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ జాతర మహోత్సవంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీ వారు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.