July 31, 2026

– కనులపండువగా స్వామివారి కల్యాణోత్సవం

– భారీగా తరలివచ్చిన భక్తులు

సంకల్పం ప్రతినిధి : పెద్దేముల్ మండల కేంద్రంలోని పురాతన శ్రీ శంభు లింగేశ్వర ఆలయంలో ఆదివారం రాత్రి శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
శోభాయమానంగా ఊరేగింపు:
కల్యాణోత్సవంలో భాగంగా ముందుగా శివపార్వతుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్త నరేష్ రెడ్డి నివాసం నుంచి శివాలయం వరకు స్వామివార్ల విగ్రహాలను భక్తుల కోలాహలం నడుమ మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తుల శివనామస్మరణతో పెద్దేముల్ పురవీధులు మారుమోగాయి.
భక్తుల పరవశం:
ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా శివపార్వతుల కల్యాణాన్ని జరిపించారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. కల్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.