తాండూర్ నియోజకవర్గంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద రూ. 6.12 కోట్లు మంజూరు… ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూర్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.6.12 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు.నూతనంగా మంజూరైన ఈ పనులను నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తూ తక్షణమే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రామాల్లో రహదారి సదుపాయాలు మెరుగుపడటంతో ప్రజలకు రవాణా సౌకర్యం మరింత సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా 2025–2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే దాదాపు రూ.14.20 కోట్ల వ్యయంతో మంజూరైన నూతన గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, మహిళా సమాఖ్య భవనాలు, ప్రభుత్వ పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పనులు త్వరలోనే పూర్తిచేసి ప్రజలకు వెంటనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి వెల్లడించారు. అదే విధంగా 2025–2026 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటివరకు దాదాపు రూ.20.3 కోట్లు మంజూరైనట్లు, మరో రూ.1.50 కోట్లు త్వరలోనే విడుదల కానున్నట్లు తెలిపారు. తాండూర్ నియోజకవర్గంలో సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో పనిచేయడం జరుగుతున్నదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
