మే 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు….పాల్గొననున్న శాసనసభ స్పీకర్, మంత్రులు
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే నెల నాలుగో తేదీ నుండి 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు నిర్వహించనున్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి తో పాటు తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, నవంద్గీ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిజాపురం మాధవరెడ్డి, కోటపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వాటిలోల బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 4తేదీన కోడంగల్ రోడ్డు మార్గంలో గల ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించే కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి,వికారాబాద్ జిల్లాలోని మున్సిపల్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, కొడంగల్ నియోజకవర్గం ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారని తెలిపారు. రైతు వారోత్సవాలలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, విత్తనాల సరఫరా, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన, ఉద్యానవన శాఖ ద్వారా ఆయిల్ ఫామ్ సాగుచేసే పద్ధతులు, ఆయిల్ ఫామ్ ఉత్పత్తిదారుల సంఘం సభ్యులను మరియు పట్టు పరిశ్రమ సాగు చేసే రైతులకు సబ్సిడీపై అవగాహన కల్పించనున్నారు. పశుసంవర్ధక శాఖ తరపున పశు వైద్య సేవలు, గొర్రెలు మేకలు పశువుల పెంపకం దారులపై చర్చ, మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారుల సంఘం పై చర్చ జరగనుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రైతులు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సహకార సంఘాల డైరెక్టర్లు, సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి వ్యవసాయ అధికారులు, మండల స్థాయి, రైతు వ్యవసాయ విస్తరణ అధికారులు, ఇతర ముఖ్య అధికారులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారని తెలిపారు.
