తిమ్మాయిపల్లి గ్రామ సమస్యలు వెంటనే పరిష్కరించాలి.. బీఆర్ఎస్ నాయకుల డిమాండ్
వికారాబాద్ జిల్లా, యాలాల మండలం: తిమ్మాయిపల్లి గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు అధికారులతో పాటు స్థానిక పాలకవర్గాన్ని కోరారు.బీఆర్ఎస్ నాయకులు కురువ కిష్టప్ప, వంగ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ కృష్ణకుమార్ మాట్లాడుతూ.. తిమ్మాయిపల్లి స్టేజ్ వద్ద బస్సు ఎక్కే, దిగే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అక్కడ మట్టి వేసి సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలని కోరారు.అలాగే తిమ్మాయిపల్లి స్టేజ్ నుంచి గ్రామానికి సుమారు కిలోమీటర్ దూరం ఉండడంతో రాత్రి సమయంలో బస్సు దిగి గ్రామానికి వెళ్లే ప్రజలు వీధి దీపాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే రహదారి వెంట విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.గ్రామంలోని పలు ప్రాంతాల్లో కూడా వీధి దీపాల కొరత ఉందని, వాటిని ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత కల్పించాలని అధికారులను కోరారు. అదేవిధంగా గ్రామంలో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఆ సమస్యను కూడా అత్యవసరంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కోరవాణి శ్రీనివాస్, ఆరో వార్డు సభ్యురాలు కోళ్ల మానెమ్మ వెంకటప్పతో పాటు పలువురు నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
