జూలై 27 నుంచి 29 వరకు ‘విత్తన మేళా’.. రైతులు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా వ్యవసాయ అధికారి బి.కవిత
వికారాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఉన్న రైతు వేదికలలో జూలై 27 నుంచి 29 వరకు ‘విత్తన మేళా’ నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి బి.కవిత తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం నెలకొన్న ఎల్-నినో పరిస్థితుల దృష్ట్యా, విత్తన మేళా సందర్భంగా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు, అత్యవసర ప్రణాళికపై అవగాహన కల్పించేందుకు ఏఈఓల ఆధ్వర్యంలో అవగాహన సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా, విత్తన మేళా సమయంలో విత్తన వ్యాపారులు రైతు వేదికలలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, అత్యవసర ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన వివిధ రకాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతుల సౌలభ్యం కోసం వివిధ కంపెనీలకు చెందిన పలు రకాల విత్తనాలు ఒకే చోట లభించే అవకాశం ఉంటుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి బి.కవిత సూచించారు.విత్తన మేళాపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి, గరిష్ట సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకోవాలని ఎంఏఓలు, ఏఈఓలను ఆమె ఆదేశించారు.
