తాండూరులో ప్రభుత్వ స్థలాల కబ్జాలపై బీఆర్ఎస్–బీజేపీ ఆందోళన…అక్రమ నిర్మాణాలు వెంటనే నిలిపివేయాలని మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం
తాండూరు పట్టణంలో ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని, అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. నాయకులు మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని సర్వే నంబర్లు 130, 135, 111లో వినాయక్ చౌక్ లో గల అవాక్యు ప్రాపర్టీ తదితర అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా సర్వే నంబర్ 130లో ఉన్న ప్రభుత్వ స్థలానికి ఇంటి నంబర్లు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ప్రభుత్వ భూమిని శాశ్వతంగా ఆక్రమించుకునే చర్యగా భావిస్తున్నామని పేర్కొన్నారు. వెంటనే అక్రమ నిర్మాణాలను నిలిపివేసి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షుడు, బీజేపీ ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, శ్రీకాంత్ రెడ్డి, అంతారం కిరణ్ కుమార్, బీఆర్ఎస్ యువ నాయకులు సంతోష్ గౌడ్, ఇర్షాద్, అజాజ్, సురేష్ నాయక్, కరుణాకర్ పటేల్, అవుసుల యోగానంద్ తదితరులు టౌన్ ప్లానింగ్ అధికారులను వెంటనే పిలిపించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కమిషనర్‌ను కోరారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్డీవో సూచనల మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి, అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలితే వాటిని నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కౌన్సిలర్ ఇర్షాద్, బీజేపీ నాయకుడు నాగారం మల్లేశం, బీఆర్ఎస్ నాయకుడు సంతోష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని అక్రమాలు జరుగుతున్నప్పటికీ అధికారులు ఎందుకు స్పందించడం లేదని మున్సిపల్ కమిషనర్‌ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు కరుణాకర్ పటేల్ మాట్లాడుతూ, తాండూరు పట్టణంలోని ప్రభుత్వ భూములను పరిరక్షించడం అధికారుల బాధ్యత అని, భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వ స్థలాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
