మట్టి గణపతులను ప్రతిష్ఠిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: తాండూరు గోశాల సేవా సమితి
తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో ‘మట్టి గణపతి.. మహా గణపతి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం తాండూరు పట్టణంలోని దిగ్రేన్ అండ్ సీడ్స్ అసోసియేషన్ హాల్‌లో జరిగిన కార్యక్రమానికి ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి ప్రకృతి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.తాండూరు పట్టణంలోని ప్రతి వార్డు, ప్రతి ఇంటిలో మట్టి వినాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.మట్టి గణపతులను ప్రతిష్ఠించే వారికి చందాలు ఇవ్వాలని వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని వినాయక ఉత్సవసమితి ప్రతినిధులకు సూచించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీకి కృషి చేస్తామని తెలిపారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనాలతో తయారు చేసిన వినాయక విగ్రహాల వల్ల కాగ్నా నది కలుషితమవుతుందని మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింహులు అన్నారు.వివిధ ప్రాంతాలకు మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి పంపిస్తున్న కుల్కచర్ల మండలం చేపలగూడెంకు చెందిన స్వామి, తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన శంకర్‌లను గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.మట్టి గణపతులను పంపిణీ చేస్తూ ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్న బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ ని కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోశాల సేవా సమితి అధ్యక్షులు వినోద్ కుమార్ జైన్, ప్రధాన కార్యదర్శి మన్మోహన్, వేణుగోపాల్ రెడ్డి, గంజ్ అసోసియేషన్ అధ్యక్షులు కటకం వీరేందర్, కోటం మురళీ, తంబాకు చంద్రశేఖర్, పర్యాద రామకృష్ణ, వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.
