అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
సంకల్పం పెద్దేముల్: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించి, వారి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామంలో బోయిని సుక్కమ్మ మొగులప్ప నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గూడు లేని పేదవాడికి ఆత్మగౌరవంతో కూడిన నివాసాన్ని అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా, పారదర్శక పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతుందని, అర్హులెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ మండల మాజీ వైస్ ఎంపీపీ మధులత, సర్పంచ్ భూమే యాదమ్మ, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
