భూ భారతి చట్టం ద్వారా రైతులకు శాశ్వత పరిష్కారం కాబోతుంది — ఎమ్మెల్యే BMR
పెద్దేముల్ మండలం, గిర్మాపూర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి–సమగ్ర భూసర్వే కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు సర్వే జరుగుతున్న రైతు రాంరెడ్డి గారి పొలాన్ని సందర్శించి, రైతులతో పాటు సర్వేయర్లతో నేరుగా మాట్లాడి సర్వే సమయంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు.
క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రక్రియను స్వయంగా పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం,ధరణి స్థానంలో భూ భారతి వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు.
గత పాలకుల నిర్లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థ గందరగోళానికి గురైందని అన్నారు.
రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో అధికారులు గ్రామాలకే వచ్చి సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారని చెప్పారు.
పట్టా సర్వే నెంబర్ స్థానంలో భూదార్ నెంబర్ ప్రవేశపెట్టబడుతుందని వివరించారు.
భూ సర్వేలో భాగంగా పట్టా భూమి, గ్రామకంఠం, ప్రభుత్వ భూములను స్పష్టంగా వేరు చేసి గుర్తించడం జరుగుతుందని తెలిపారు.
సర్వే సమయంలో ఎదురయ్యే సమస్యలను రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
భూ భారతి చట్టం ద్వారా రైతులకు పారదర్శకమైన, సుస్థిరమైన భూ రికార్డు వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివరాం నాయక్, మర్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి,నాయకులు లొంక నర్సింలు, రాంరెడ్డి తోపాటు రెవిన్యూ అధికారులు పలువురు పాల్గొన్నారు.
