శాకాంబరీ దేవిగా శ్రీ వాసవి మాత దివ్య దర్శనం.. భక్తులతో కిక్కిరిసిన నాగేశ్వర ఆలయం
ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా తాండూరు పట్టణంలోని శ్రీ నాగేశ్వర దేవాలయంలో శ్రీ వాసవి మాత అమ్మవారు శాకాంబరీ దేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఆర్యవైశ్య సంఘం, శ్రీ నాగేశ్వర దేవాలయ పాలకమండలి సహకారంతో శ్రీ వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో శాకాంబరీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మహిళా సంఘం సభ్యులు అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అత్యంత వైభవంగా అలంకరించారు. ప్రకృతి సంపదకు ప్రతీకగా భావించే శాకాంబరీ దేవి రూపంలో అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల “జై వాసవి మాత” నినాదాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో మహా కుంకుమార్చన నిర్వహించగా, పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. తమ కుటుంబాలకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని అమ్మవారిని ప్రార్థించారు. శాకాంబరీ ఉత్సవాల్లో భాగంగా తాండూరు పురపాలక చైర్‌పర్సన్ శ్రీమతి పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి ఆలయానికి విచ్చేసి శ్రీ వాసవి మాతను దర్శించుకున్నారు. అనంతరం భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ దాదాపురం సతీష్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోట మురళీకృష్ణ, కార్యదర్శి కొట్రిక కిరణ్ కుమార్, వాసవి మహిళా సంఘం అధ్యక్షులు గుబ్బ ప్రగతి, కార్యదర్శి తాళ్లపల్లి కవిత, కోశాధికారి వేముల పల్లవి, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ అధ్యక్షులు, కార్యదర్శులు, ఆర్యవైశ్య సంఘం, మహిళా సంఘం, యువజన సంఘం కార్యవర్గ సభ్యులు, వాసవి భక్తులు, పట్టణ ప్రముఖులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా మహా ప్రసాద వితరణ కార్యక్రమంలో తాళ్లపల్లి మంజుల బాలరాజ్ ఆధ్వర్యంలోని క్రేజీ కిట్టీ సభ్యులు సేవలు అందించారు. భక్తుల భారీ రాకతో శ్రీ నాగేశ్వర దేవాలయం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.
