RBI గ్రీన్ సిగ్నల్.. త్వరలో మార్కెట్లోకి కొత్త పాలిమర్ నోట్లు.. ఇక చిరగవు, తడవవు!
భారతదేశంలో త్వరలో ప్లాస్టిక్‌ను పోలి ఉండే కొత్త పాలిమర్ కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం ఉంది. రూ.10, రూ.20 డినామినేషన్లలో పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా జారీ చేయాలన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ప్రారంభ దశలో క్షేత్రస్థాయి ప్రయోగాల కోసం మొత్తం 10 కోట్ల పాలిమర్ నోట్లను పరిమిత స్థాయిలో చలామణిలోకి తీసుకురానున్నారు. దేశంలోని విభిన్న వాతావరణ పరిస్థితులు, ప్రజల వినియోగ విధానాల్లో ఈ నోట్లు ఎంతకాలం మన్నికగా ఉంటాయి, వాటి పనితీరు ఎలా ఉంటుంది అనే అంశాలను పరిశీలించనున్నారు.సాధారణ కాగితపు కరెన్సీ నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు మరింత బలంగా, ఎక్కువకాలం మన్నికగా ఉంటాయని ఆర్‌బీఐ భావిస్తోంది. ఇవి సులభంగా చిరిగిపోవు. నీరు తగిలినా త్వరగా పాడవకుండాఉండటంతో పాటు మురికి కూడా తక్కువగా పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో పాలిమర్ కరెన్సీ నోట్లు విజయవంతంగా ఉపయోగిస్తున్నారు.అయితే, ప్రస్తుతం ఉన్న కాగితపు కరెన్సీ నోట్లను నిలిపివేస్తారనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కాగితపు కరెన్సీని పూర్తిగా తొలగించే ప్రతిపాదన ప్రస్తుతం లేదని తెలిపింది. ఇప్పటికే చలామణిలో ఉన్న కాగితపు నోట్లతో పాటు కొత్త పాలిమర్ నోట్లు కూడా కొనసాగుతాయని వెల్లడించింది.దీంతో ప్రజలు తమ వద్ద ఉన్న కాగితపు కరెన్సీ నోట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉండదని స్పష్టమవుతోంది. పాలిమర్ నోట్ల ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో వాటిని పెద్ద ఎత్తున చలామణిలోకి తీసుకురావడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఇక పాలిమర్ నోట్ల ప్రవేశం డిజిటల్ చెల్లింపులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంపై ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటు అవుతుందని ఆర్‌బీఐ తెలిపింది. నగదు చెల్లింపులు, డిజిటల్ చెల్లింపులు ఒకదానికొకటి పూరకంగా ఉంటాయని, భవిష్యత్తులో కూడా రెండూ కలిసి కొనసాగుతాయని కేంద్ర బ్యాంక్ విశ్వసిస్తోంది.మొత్తానికి.. చిరగకుండా, తడవకుండా, ఎక్కువకాలం మన్నికగా ఉండే కొత్త పాలిమర్ నోట్లు త్వరలో భారతీయుల చేతుల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
