July 30, 2026

పొట్లీ మహారాజ్ దేవాలయ చైర్మన్ పదవి గౌడ కులస్తులకే కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం

IMG_20260728_131906259

తాండూరు పట్టణంలోని  శ్రీ పొట్లీ మహారాజ్ దేవాలయ చైర్మన్ పదవిని గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ  ప్రకారం గౌడ కులస్తులకే కేటాయించాలని గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. మంగళవారం తాండూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని కలిసిన గౌడ కులస్తులు  పోట్లీ మహారాజ్ దేవాలయ చైర్మన్ పదవి విషయంలో గౌడ సామాజిక వర్గానికి కేటాయించాలని పార్టీ ఏదైనా గౌడ కులానికే పదవిని కట్టబెట్టాలని విజ్ఞప్తి చేశారు.  గత ఇరవై సంవత్సరాలుగా  పొట్లీ మహారాజ్ దేవాలయ చైర్మన్ పదవిని గౌడ కులస్తులకు కేటాయిస్తూ వస్తున్నారనగుర్తు చేశారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఒక  వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వడం వల్ల గౌడ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గంలో సుమారు 25 వేల మందికి పైగా గౌడ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉన్నప్పటికీ రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం కూడా పొట్లీ మహారాజ్ దేవాలయ చైర్మన్ పదవిని ఇతర సామాజిక వర్గానికి కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తమకు సమాచారం  అందిందని, అలా జరిగితే గౌడ సామాజిక వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా కించపరిచిన చర్యగా భావించాల్సి వస్తుందని హెచ్చరించారు. అందువల్ల గతంలో మాదిరిగానే ఈసారి కూడా పొట్లీ మహారాజ్ దేవాలయ చైర్మన్ పదవిని గౌడ కులస్తులకే కేటాయించాలని కోరారు. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో ఆ పదవిని ఇతర సామాజిక వర్గానికి కేటాయించాల్సి వస్తే, శ్రీ నగరేశ్వర దేవాలయం లేదా శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయం కమిటీలలో గౌడ సామాజిక వర్గానికి చైర్మన్ పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, సుదర్శన్ గౌడ్, రాజన్ గౌడ్,  మెకానిక్ రాజు గౌడ్,  బి ఆర్ ఎస్  యువ నాయకులు సంతోష్ గౌడ్, బీఆర్ఎస్  తాండూరు మండల నాయకుడు రాకేష్ గౌడ్ తదితరులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు.