తాండూరు పట్టణంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా శ్రీ సాయిబాబా పల్లకి మహోత్సవం…
తాండూరు పట్టణం కోకట్ రోడ్డులో వెలిసిన శ్రీ శిరిడి సాయిబాబా పల్లకి మహోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని లక్ష్మీ మహల్ థియేటర్ సమీపంలోని శ్రీ తుల్జా భవాని అమ్మవారి దేవాలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర ఇందిరా చౌక్, శివాజీ చౌక్, భద్రేశ్వర్ చౌక్, శ్రీ కాళికాదేవి దేవాలయం, కోర్టుముందునుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా కోకట్ రోడ్డులోని శ్రీ సాయిబాబా ఆలయం వరకు ఘనంగా సాగింది. పల్లకిలో శ్రీ సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించి భజనలు, మంగళ వాయిద్యాలు, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటపాటలతో నిర్వహించిన ఈ శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. “ఓం సాయిరామ్” నామస్మరణలతో పట్టణ వీధులన్నీ భక్తిమయ వాతావరణంలో మార్మోగాయి. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవను ప్రారంభించారు. అనంతరం భక్తులతో కలిసి శోభాయాత్రలో పాల్గొని శ్రీ సాయిబాబా ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా నీరజ బాల్‌రెడ్డి మాట్లాడుతూ, ఆధ్యాత్మిక చింతన, భక్తి భావంతోనే మనశ్శాంతి లభిస్తుందని, శ్రీ సాయిబాబా కృప తాండూరు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సనాతన విలువలను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. పల్లకి సేవలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సాయిపుత్ర హోమ్ నీడ్స్ అధినేత శంకర్ యాదవ్, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ కన్వీనర్ రాజ్‌కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, సాయిబాబా సేవా సమితి సభ్యులు, మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో బాబా భక్తులు పాల్గొన్నారు. మార్గమధ్యంలో పలువురు భక్తులు హారతులు ఇచ్చి పల్లకికి ఘన స్వాగతం పలికారు. భక్తుల కోలాహలం, భజనలు, ఆధ్యాత్మిక ఉత్సాహంతో సాగిన శ్రీ సాయిబాబా పల్లకి మహోత్సవం విజయవంతంగా ముగిసింది.
