రైతు నేస్తం కార్యక్రమంలో శాస్త్రవేత్తల కీలక సూచనలు ఎల్‌నినో ప్రభావంతో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన
వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో పంటల సాగు చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం గ్రామంలో నిర్వహించిన ఎల్‌నినో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అవగాహన కార్యక్రమంలో రైతులకు పలు కీలక సూచనలు చేశారు.తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక “రైతు నేస్తం” కార్యక్రమం 100వ ఎపిసోడ్ సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార మరియు చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆన్‌లైన్ ద్వారా రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని, వ్యవసాయ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలతోనే పంటల సాగు చేపట్టాలని కోరారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని సూచించారు. తాండూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. సి. సుధారాణి మాట్లాడుతూ, వికారాబాద్ జిల్లా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రైతులకు వివరించారు. ఇంకా విత్తనాలు వేయని రైతులు తక్కువ కాలంలో పండే మధ్యకాల పంటలను ఎంచుకోవాలని, ఇప్పటికే సాగులో ఉన్న పంటలకు సాధ్యమైనంత మేర అనుబంధ నీటిపారుదల అందించి తేమ కొరతను నివారిస్తే దిగుబడులను కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీమతి కె. స్వాతి, జిల్లా వ్యవసాయ అధికారి కవిత, తాండూరు సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, తాండూర్ నియోజకవర్గం లోని రైతులు పాల్గొన్నారు.
