భారీ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్.. జిల్లాల్లో 24×7 కంట్రోల్ రూమ్‌లు.. ‘జీరో క్యాజువాలిటీస్’ లక్ష్యంగా చర్యలు
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి డీజీపీ సి.వి. ఆనంద్‌తో పాటు ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులతో వర్ష పరిస్థితులు, చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించారు.ఈ సందర్భంగా సీఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ ప్రతి జిల్లాలో 24×7 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో మోహరించినట్లు తెలిపారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు నిరంతరాయంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, కూలిపోయే ప్రమాదంలో ఉన్న పాత భవనాలను గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.నీటిపారుదల శాఖతో సమన్వయం కొనసాగిస్తూ జలాశయాలు, వాగులు, చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. రహదారులపై రాకపోకలకు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల కోసం ర్యాపిడ్ యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. పోలీసు శాఖతో కలిసి సంయుక్తంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తూ “జీరో క్యాజువాలిటీస్” లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ జిల్లా పోలీసు అధికారులు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైన చోట ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా వినియోగిస్తామని తెలిపారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పోలీసు అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ముందస్తు రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాకు కేటాయించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పారు. వాగులు, నదులు, కల్వర్టుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా నిఘా పెంచినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించే ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ స్నేహ మెహర, అదనపు కలెక్టర్ వెంకటాచారి, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, జడ్పీ సీఈఓ సుధీర్, సీపీఓ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
