September 19, 2026

బషీరాబాద్ ఎంపీడీవో కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ తీరుపై బషీరాబాద్ సర్పంచ్‌ల ఆగ్రహం

ChatGPT Image Jul 30, 2026, 07_19_39 PM

బషీరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ వ్యవహార శైలిపై మండలంలోని పలువురు సర్పంచ్‌లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీల అభివృద్ధి పనులు ఆయన నిర్లక్ష్య వైఖరి కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఆరోపిస్తూ గురువారం మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్ విజయ్ కుమారికి వినతిపత్రం సమర్పించారు. సర్పంచ్‌లు మాట్లాడుతూ, కంప్యూటర్ ఆపరేటర్ తనకు అనుకూలమైన సమయాల్లో మాత్రమే కార్యాలయానికి హాజరవుతున్నారని, దీంతో గ్రామపంచాయతీలకు సంబంధించిన అనేక అత్యవసర పనులు పెండింగ్‌లో పడుతున్నాయని తెలిపారు. అత్యవసర అవసరాల కోసం పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించడం లేదని ఆరోపించారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని, పనుల పురోగతి గురించి ప్రశ్నిస్తే “నాకు సమయం ఉన్నప్పుడు చేస్తా” అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని సర్పంచ్‌లు పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రజాప్రతినిధులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని కూడా ఆరోపించారు. కంప్యూటర్ ఆపరేటర్ తీరుతో గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు, లబ్ధిదారులకు బిల్లులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కంప్యూటర్ ఆపరేటర్‌ను విధుల నుంచి తొలగించాలని సర్పంచ్‌లు డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే మండలంలోని అన్ని గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజు పటేల్, సర్పంచ్ పోలీస్ నవీన్ రెడ్డి, రమణి, బసప్ప, పాండురంగ రెడ్డి, కృష్ణ కుమార్, జైపాల్ రెడ్డి, సునీత, రంగారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, పలువురు సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.