August 1, 2026

చేవెళ్లలో పెండింగ్ రైల్వే పనులను వేగవంతం చేయాలంటూ కేంద్ర మంత్రి వి. సోమన్నకు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి

చేవెళ్లలో పెండింగ్ రైల్వే పనులను వేగవంతం చెయ్యాలని కేంద్ర మంత్రి వి. సోమన్నకు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ROB), అండర్ బ్రిడ్జిల (RUB) పనులను తక్షణమే ప్రారంభించాలని చేవెళ్ల ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోరారు. గురువారం న్యూఢిల్లీలోని రైలు భవన్‌లో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ వి. సోమన్నతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు రైల్వే సమస్యలపై మంత్రితో చర్చించి, వినతిపత్రం అందజేశారు. గత ఏడాది శంకరపల్లి పర్యటనకు వచ్చిన కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్‌కు కూడా ఈ అంశాలపై మొరపెట్టుకున్న విషయాన్ని ఎంపీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రధాన డిమాండ్లు ఇవే:
హుబ్లీ ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్: నావంద్గి రైల్వే స్టేషన్‌లో హుబ్లీ ఎక్స్‌ప్రెస్ రైలును నిలపాలన్న ప్రతిపాదనకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేశారని, దీనిపై రైల్వే బోర్డు తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
వికారాబాద్‌లో ఆర్‌ఓబీ పనులు: వికారాబాద్ జిల్లా కోర్టు సమీపంలో మరియు రామయ్యగూడ ప్రాంతాల్లో రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద డీపీఆర్ (DPR) ప్రక్రియ పూర్తయిందని, అక్కడ వెంటనే ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ నిర్మాణ పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
కీలక ప్రాంతాల్లో అండర్ పాస్‌లు: కొండకల్, ముబారక్ పూర్, మర్పల్లి, పాత శంకర్పల్లి, మొరంగుపల్లి, గేట్ వనంపల్లి, గొల్లగూడ, నావంద్గి, సిద్ధాంతి, శాతం రాయి, ఫతేపూర్ ప్రాంతాల్లో ఎల్‌హెచ్‌ఎస్ (LHS) నిర్మాణాల అవశ్యకతను వివరించారు.
ఎంపీ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి వి. సోమన్న సానుకూలంగా స్పందించారు. పెండింగ్ పనుల స్థితిగతులపై నివేదిక తెప్పించుకుని, పనుల వేగవంతానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.