హైదరాబాదులో మూతపడుతున్న పెట్రోల్ బంకులు
హైదరాబాద్ మహానగరంలో మంగళవారం నాడు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు పెట్టి మూసివేయడంతో, తెరిచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు కనిపించాయి. రాష్ట్రంలో ఎక్కడ ఇంధన కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. హైదరాబాద్ లోని ఉప్పల్, మల్లాపూర్, ఘట్కేసర్, అత్తాపూర్, కాటేదాన్, చంద్రయన్గుట్ట తదితర ప్రాంతాల్లో పెట్రోల్ పంపులు మూతపడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్నిచోట్ల తెరిచి ఉన్న బంకుల దగ్గర కార్లు ఆటోలు బైకులతో భారీ రద్దీ నెలకొంది. నాంపల్లి సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర ఆటోలు గంటల తరబడి బారులు తీరడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో డీజిల్ , పెట్రోల్ లేదా వంటగ్యాస్కు ఎలాంటి వరద లేదని స్పష్టం చేసింది. కొన్ని తప్పుడు వదంతుల కారణంగా ప్రజలు ఆందోళన గురై, తమ వాహనాలను పూర్తి ట్యాంకులు నింపుకోవడానికి ఒక్కసారిగా పెట్రోల్ బంకుల దగ్గరికి చేరుకోవడంతో కృత్రిమ కొరత ఏర్పడిందని తెలిపారు. ఇంధనాన్ని అక్రమంగా నిల్వచేసిన, బ్లాక్ మార్కెట్ కు తరలించిన కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు వదంతులను నమ్మరాదని, అనవసరంగా ఆందోళన చెంద రాదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ సామాజిక వేదికగా విజ్ఞప్తి చేశారు. ఏదైనా సమాచారం కోసం1967 టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.
