ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించం- కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు..!
మే 17 : తాండూరు ఎమ్మెల్యే పై నిరాధార ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు హెచ్చరించారు.
శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది సోషల్ మీడియా ఆర్టిస్టులు నియోజకవర్గంలో ఏ చిన్న సంఘటన జరిగినా అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం దురదృష్టకరమని విమర్శించారు.
ప్రతి శాఖకు ఒక విధమైన వ్యవస్థ, బాధ్యతలు ఉంటాయని, వాటిపై అవగాహన లేకుండా ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూపించే ప్రయత్నం జరుగుతోందన్నారు. డ్రగ్స్ కేసులో దొరికిన రోహిత్ రెడ్డి వ్యవహారాన్ని ప్రజలు మర్చిపోవాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ పాలనలో రోజుకో తప్పుడు కేసు, రోజుకో సంఘటన జరిగేదని, వాటిలో బీఆర్ఎస్ నాయకులే నిందితులుగా ఉండేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయని, ఎమ్మెల్యే నాయకత్వంలో ప్రజా పాలన పారదర్శకంగా సాగుతోందని తెలిపారు. ఈ మార్పులను జీర్ణించుకోలేని కొందరు పనికిమాలిన విషయాలను ఎమ్మెల్యేతో ముడిపెడుతూ తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి వైద్యుల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్నారని, ఆసుపత్రి పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్‌తో కలిసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.
జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ కూడా ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటే, స్థానిక బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో అనుమానాలు కలిగించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిరుపేద ప్రజలను ప్రభుత్వ ఆసుపత్రులకు దూరం చేసే కుట్రలను ప్రజలు గమనించాలని కోరారు.
అలాగే బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యేను ముస్లిం సోదరులకు దూరం చేయాలనే ఉద్దేశ్యంతో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే తాండూరు ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా భావిస్తారని తెలిపారు. రెండు రోజుల క్రితమే క్యాంపు కార్యాలయంలో పోలీసు అధికారులు, మున్సిపల్ ప్రతినిధులు, మైనారిటీ పెద్దలతో సమావేశం నిర్వహించి పండుగ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారని వెల్లడించారు.
ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధికి సహకరించి సూచనలు ఇస్తే స్వాగతిస్తామని, కానీ అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలు చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బాతుల నాగరాజు హెచ్చరించారు.
